వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని , తక్షణమే తమకు వేతనాలు చెల్లించాలని సవర భాషా వలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయం ఎదుట భిక్షాటన కార్యక్రమంతో నిరసన తెలిపారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 150 మంది భాషా వలంటీర్లకు ఐటీడీఏ వేతనాలు చెల్లించడం లేదని వారన్నారు. మిగతా ఐటీడీఏల్లో ఈ పరిస్థితి లేదని, పనిచేస్తున్న వారికి వేతనాలు చెల్లించారని భాషా వలంటీర్ల రాష్ట్ర కార్యదరి సవర డొంబు తెలియజేశారు. తమకు రెన్యువల్ కూడా ఇంతవరకు చేయలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీతంపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ కిషోర్‌వర్మ, పాలకొండ ఎస్‌ఐ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆనంద్, మండల కార్యదర్శి సవర రాజు తదితరులు పాల్గొన్నారు.