గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో గిరిపుత్రులకు అవస్థలు తప్పడం లేదు. ఇందుకు సీతంపేట మన్యంలో నెలకొన్న పరిస్థితే నిదర్శనంగా చెప్పొచ్చు. వాస్తవంగా గిరిజనులకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో సీతంపేట మండలంలో కొత్తగా 29 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అయితే నిధులు మాత్రం కేటాయించడం లేదు. మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు. ఇప్పటికీ ఆయా పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవు. గ్రామసభకు హాజరైన వారికి కనీసం కుర్చీలు కూడా వేయలేని దుస్థితి. దీంతో టర్పాలిన్లు పర్చుకుని కిందనే కూర్చోవాల్సి వస్తోంది. మొత్తంగా సర్కారు తీరుతో సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీలు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా కనీస వసతులు సమకూర్చకపోవడంపై ఆయా గ్రామస్థులు మాత్రం పెదవి విరుస్తున్నారు.