ఆర్ధిక మాంద్యం భయంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంస్థ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. అమెరికా మిస్సిస్సిప్పికి చెందిన ప్రముఖ యునైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్ (UFI) సంస్థ 20 ఏళ్లగా బడ్జెట్ ధరలో సోఫాలు,రిక్లైనర్‌లు తయారు చేయడంలో ఖ్యాతి గడించింది. అమెరికన్లు పెద్దఎత్తున జరుపుకునే థ్యాంక్స్ గివింగ్ డే పండగకు కేవలం రెండు రోజుల ముందు అర్ధరాత్రి సుమారు 2,700 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. "మీరు రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు. ఆఫీస్ ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర వస్తువులు మీ వద్ద ఉంటే వాటిని వెంటనే సబ్మిట్ చేయండి" అంటూ మెసేజ్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.