‘జీరో కోవిడ్’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని యూనివర్సిటీల విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నాయి. దీంతో విద్యా సంస్థలు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని వర్సిటీలు బస్సులు ఏర్పాటుచేసి మరీ విద్యార్థులను రైల్వేస్టేషన్లకు తరలిస్తున్నాయి.
ఇటీవల 8 నగరాల్లో చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనలు.. బ్రిటన్, అమెరికా వంటి పలు దేశాల నుంచి వాటికి లభించిన మద్దతు నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను స్వల్పంగా సడలిస్తామని చైనా తాజా ప్రకటన చేసింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రాజీనామా కోరుతూ ఈ ఆందోళనలు రాజకీయ మలుపు తిరగడం కూడా ఈ వైఖరికి మరో కారణం.