మదనపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ బాలుడి దీర్ఘకాలిక వ్యాధి గురించి విని చలించిపోయారు. ఆ బాలుడికి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం మదనపల్లెలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నుంచి 4వ దశ జగనన్న విద్యా దీవెన నగదును విడుదల చేసేందుకు సీఎం వచ్చారు. హమీద అనే మహిళ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన బిడ్డ మహమ్మద్ అలీతో కలిసి సభా వేదిక వద్ద నిల్చుంది. బిడ్డతో సహా నిలబడిన మహిళను గమనించిన సీఎం వైయస్ జగన్.. కార్యక్రమం అనంతరం ఆ మహిళ వద్దకు వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అలీ వ్యాధి గురించి విని సీఎం చలించిపోయారు. `తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స చేయించడానికి ఆర్థిక స్థోమత సరిపోక ఇబ్బందులు పడుతున్నా`మని హమీద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వివరించింది. ముఖ్యమంత్రి వెంటనే ఆమెకు ఆర్థికపరమైన సహాయం అందచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.