'పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు. సమాజం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. మాకు-పవన్‌కు మధ్య ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అదంతా అవాస్తవం. బేస్ లేస్ ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబానికి, పవన్ కళ్యాణ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి ప్రచారాన్ని ఆయన పట్టించుకోరు. మేము కూడా అర్థం చేసుకుంటాం. అలాగే వల్లభనేని వంశీ ఆడవాళ్ల గురించి మాట్లాడింది కూడా తప్పు. రాజకీయాల్లో ఈ కల్చర్ మంచిది కాదు' అని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే దివంగత నేత పరిటాల రవి బతికి ఉన్నప్పుడు.. ఓ విషయంలో ఆయన పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టించారని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ అంటే గిట్టనివారు దీన్ని ప్రతిసారీ ఆయుధంగా వాడుకొని.. పవన్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయితే.. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి పరిటాల రవి లేరు. పవన్ దీనిపై పరోక్షంగా స్పందించినా.. స్పష్టత ఇవ్వలేదు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమయంలో.. పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరామ్.. ఈ ఇష్యూ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పవన్‌తో తమ సంబంధం గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.
'గుడ్ మార్నింగ్ ధర్మవరం మంచి ప్రోగ్రాం. నాయకుడు ప్రజల్లో తిరగడం మంచి పనే. ఎందుకంటే.. ప్రజల్లోకి వెళ్తే సమస్యలు తెలుస్తాయి. ప్రజలకు కూడా ఆశ ఉంటుంది పనులు జరుగుతాయని. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో గ్రామాలకు వెళ్తున్నారు. ఆఫీసర్లను తిడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. రాజకీయం అనేది కేవలం ఫేస్‌బుక్, యూట్యూబ్ వరకే ఆగిపోతే మంచిది కాదు కదా. అలాగే.. సమస్యలు కూడా ఏం పరిష్కారం కావడం లేదు. కేవలం ఆఫీసర్లను తిట్టి పోతే పనులు అవుతాయా' అని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.
'ఒక మాట మాట్లాడితే.. పది మాటలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా. ఒక దెబ్బ కొడితే.. పది కొట్టడానికి రెడీగా ఉన్నా. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నవారు దీని గురించి ఆలోచించడం లేదు. రాజకీయాలు హెల్దీగా ఉండాలి. కానీ.. ఇప్పుడు వారికి పవర్ ఉంది కాబట్టి ఏమీ కనిపించడం లేదు. దీంతో గ్రామాల్లో ఇంకా పెరుగుతున్నాయి. పరిటాల రవికి మంచి ఇమేజ్ ఉంది. ఆయన స్థాయికి ఎదగడం కంటే.. ఆ పేరు చెడగొట్టడం నాకు నచ్చదు. ఎందుకంటే వారి సమయంలో.. పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు' అని శ్రీరామ్ స్పష్టం చేశారు.
'మా ప్రాణం పోయేంతవరకు తెలుగుదేశం పార్టీని వదిలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా పార్టీని వదులుకునే ప్రసక్తే లేదు. అవకాశం లేకుంటే ఇంట్లో కూర్చొని అయినా మళ్లీ పార్టీకే పనిచేస్తాం తప్ప.. పార్టీ మారే ప్రసక్తే ఉండదు. ఈ పార్టీకోసం మా నాన్న పనిచేశారు. ప్రాణాలు పోతాయని తెలిసినా దీంట్లోనే ఉన్నారు. అందుకే ఈ పార్టీని నిలబెట్టుకోవడం మా బాధ్యత. 2019 ఎన్నికల తర్వాత ధర్మవరంలో టీడీపీకి చెందిన లీడర్ పార్టీ మారారు. దీంతో చంద్రబాబు నన్ను ధర్మవరం వెళ్లమని చెప్పారు. ధర్మవరం కనీసం సర్పంచి ఎన్నికల్లో నామినేషన్ వేసే పరిస్థితి లేదు. కొన్ని మండలాల్లో నాయకులకు అండగా ఉండి.. నామినేషన్లు వేయించాను' శ్రీరామ్ వివరించారు.
'లోకేశ్ చాలా మొండివారు. తిట్లకు, చప్పట్లకు ప్రిపేర్ అయ్యారు. కేసులు పెట్టి లోపల వేసినా.. లోకేశ్ వెనకడుగు వేయరు. తెలుగుదేశం పార్టీకి లోకేశ్ పాదయాత్ర ఎంతో మేలు చేస్తుంది. టీడీపీ భవిష్యత్తు లోకేశ్. నాపై చాలా కేసులు ఉన్నాయి. 9 కేసులు పెట్టారు. వాటితో ఎలాంటి భయం లేదు. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యాను. నాకు చాలా బాధ అనిపించింది. రెండు నెలలు చాలా బాధ పడ్డాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి.. జనంలోకి వెళ్లాను. ఇప్పుడే కాదు.. ఎప్పటినుంచో ధర్మవరంతో మా కుటుంబానికి బంధం ఉంది. అక్కడినుంచే పోటీ చేస్తా' అని పరిటాల శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు.