భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో డిసెంబర్ 23 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా జనవరి 2న స్వామివారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్తర ద్వార దర్శనం వేడుకను కనులారా వీక్షించాలనుకునే భక్తులకు టికెట్ల విక్రయం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో టికెట్లు విక్రయిస్తున్నారు. అంతే కాకుండా ఆఫ్ లైన్ లో కూడా నేరుగా వివిధ టికెట్ కౌంటర్ల ద్వారా టికెట్లను విక్రయిస్తున్నారు.
ఇందుకోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. రూ. 2000, రూ. 1, 000, రూ. 500, రూ. 250 టికెట్లు కావలసినవారు www. bhadrachalamonline. com వెబ్ సైట్ ద్వారా డిసెంబర్ 1 నుంచి టికెట్లు పొందవచ్చని దేవస్థానం వెల్లడించింది. కొత్తగూడెం రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం, భద్రాచలం రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం, రామాలయం మెయిన్ టికెట్ కౌంటర్, సీఆర్ఓ కార్యాలయం (తానిషా కళ్యాణ మండపం), బ్రిడ్జి పాయింట్ సిఆర్ఓ ఆఫీస్ కూడా నేరుగా భక్తులకు టికెట్లను విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు.