రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలను నిర్వీర్యం చేసి టీడీపీ నాయకులే టార్గెట్‌గా జగన్ పాలన సాగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. రాష్ట్రంలో తుపాకీ రాజ్యం పోవాలంటే సీఎం జగన్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించలేని వ్యక్తి సీఎం జగన్ అని, ఆయనకి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసును రాష్ట్రంలో న్యాయం జరగదని తెలంగాణకు సీబీఐ బదిలీ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఏ విధంగా ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. పత్రికలపై కూడా తన అక్కసు వెళ్లగక్కుతూ దాడులకు దిగడం హేయమైన చర్య అని విమర్శించారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీపీ నిమ్మాన బైరాగి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.సురేష్, గాలి వెంకటరెడ్డి, వెంకటేశం, కె.ఫల్గుణ రావు పాల్గొన్నారు.