బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలోని ఐదు రోడ్ల కూడలికి కూసింత దూరంలోని మలుపులో వున్న బ్రిడ్జి వద్ద వాహన దారులు ఆదమరిచారా ప్రమాదం తప్పదు సుమా అంటూ స్థానికులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది రోడ్ల విస్తరణలో భాగంగా ప్రభుత్వం సుమారు 600 మీటర్లు సిమెంటు రోడ్డు నిర్మాణం జరిగింది. గతంలో ఉన్న రోడ్డుపైకి ఎత్తు ఒకటిన్నర అడుగు మేర పెరగడంతో బ్రిడ్జి వద్ద ఉన్న రక్షణ గోడ రోడ్డు లెవెల్ కు చేరుకుంది. దీంతో వాహనదారులకు, బాటసారులకు ప్రమాదకరంగా మారింది.
వర్షం వస్తే బ్రిడ్జిపైన ఇరువైపుల నీరు నిలవడంతో పరిస్థితి ప్రాణ సంకటంగా మారింది. ఆర్. అండ్. బి. సిమెంటు రోడ్డు వేశారేకానీ బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడ నిర్మించడం మరిచి పోయారు. రక్షణ గోడలేని బ్రిడ్జిపై ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. దేవాలయం ఉత్తర భాగంలోని డ్రైనేజీ కాలువ నిర్మిస్తున్న క్రమంలో కూడా బ్రిడ్జిపై రక్షణ గోడ నిర్మించక పోవడం విచారకరమని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే ఆర్. అండ్. బి. అధికారులు స్పందించి రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టి ప్రజలను ప్రమాదాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.