రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కడప జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో దిగుబడి దాదాపు 80 లక్షల టన్నులు ఉండగా పూర్తి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. కానీ ప్రభుత్వం కేవలం 30 లక్షల టన్నులు మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.
గత 15 రోజుల్లో కేవలం ఐదు లక్షల టన్నులు మాత్రమే సేకరించారు అన్నారు. 17% తేమ ఉంటేనే కొనుగోలు చేస్తాం అనడం సరికాదన్నారు. తేమ శాతం అధికంగా ఉన్నప్పటికీ, తడిసిన ధాన్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అలా కాని పక్షంలో దళారులు, మిల్లర్లు ఐదు నుంచి ఎనిమిది కేజీలు తరుగు తీస్తున్నారు అన్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు.
లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలు సైతం రైతుల వద్ద నుంచి మిల్లర్లు వసూలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీగా, ప్రతి ధాన్యపు గింజను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.