చావు ఎపుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు అన్నది రుజువు చేసే ఘటన చోటు చేసుకొంది. మృత్యువు ఎప్పుడు, ఏ వైపు నుంచి దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకూ ఆనందంగా జర్నీ చేస్తున్నవారు అకస్మాత్తుగా యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలు విడిచిన దుర్ఘటనల గురించి అనేకం వినుంటారు. కానీ, ఇది అన్నింటికీ భిన్నమైంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎవరి ఊహకూ అందదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హరికేశ్ కుమార్ దూబే అనే వ్యక్తి విండో సీటు పక్కన కూర్చున్నాడు. తోటి ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. సమయం ఉదయం 8.45 గంటలు. చలి కారణంగా కిటికీ గ్లాస్ కిందికి దించే ఉంది. రైలు వేగంగా వెళ్తోంది. ఇంతలో ఎక్కడ నుంచి దూసుకొచ్చిందో తెలియదు.. ఓ ఇనుప కడ్డీ ఆ కిటికీ అద్దాలను పగులగొట్టుకుంటూ వచ్చి హరికేశ్ మెడలో గుచ్చుకుంది. అతడి కళ్లలోంచి కూడా రక్తపు ధారలు బయటకి వచ్చాయి.
ఎదురుగా ఉన్నవారు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే హరికేశ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ సమీపంలోని రైల్లో దన్వార్, సోమ్నా స్టేషన్ల మధ్య శుక్రవారం (డిసెంబర్ 2) ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు కిటికీని చేధించుకుంటూ దూసుకొచ్చిన ఐరన్ రాడ్.. హరికేశ్ కుమార్ మెడను చిధ్రం చేసి, క్షణాల్లో అతడి ప్రాణాలు తీసింది. ఇంగ్లిష్ సినిమా ‘ఫైనల్ డెస్టిడేషన్’ సిరీస్‌లోనే ఇలాంటి షాకింగ్ మృత్యు ఘటనలు చూసుండవచ్చు..! ‘కొన్ని చోట్ల ట్రాక్‌ను సరిచేసేందుకు ఉపయోగించే ఇనుపకడ్డీ బోగీలోకి దూసుకొచ్చింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’ అని రైల్వే అధికారులు తెలిపారు. కోచ్‌లోని ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు రైల్వే సిబ్బంది అలీగఢ్ జంక్షన్‌లో రైలును ఆపించారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు.