శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు కావాల్సిందేనని రాయలసీమ ఐక్య కార్యాచరణ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. అన్యాయం జరిగిన రాయలసీమ కన్నీళ్లను న్యాయ రాజధానితో తుడవాలన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల ఏమొస్తుందని కొందరు అంటున్నారని.. వారి ఆలోచనలు అర్థరహితమని విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో ఈ నెల 5వ తేదీన జరుగుతున్న రాయలసీమ గర్జనకు లక్షలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయ రాజధాని రావడం వల్ల 9 జాతీయ రహదారులతో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. 10,500 ఎకరాల్లో దేశంలోనే ఎనిమిదో అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని ప్రకటించిన నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగిత సమసిపోతుందన్నారు. రాయలసీమకు రాజధాని రావాలంటే ప్రతి ఒక్కరి మద్దతు అవసరముందని విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. మనందరి భవిష్యత్తు కోసం జరిగే ఈ ఉద్యమానికి లక్షలాదిగా తరలివచ్చి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.