అనైతిక బంధాలు మానవసంబంధాలు అంతరించేలా చేస్తున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చిన భార్య అతడి మరణానికి కారణమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతాక్రజ్‌కు చెందిన కవిత-కమల్‌కాంత్ భార్యాభర్తలు. భర్తతో విభేదాల కారణంగా అతడి నుంచి దూరంగా వెళ్లిపోయిన కవిత.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది.
కమల్‌కాంత్, హితేశ్ జైన్ బాల్యస్నేహితులు. ఇద్దరూ వ్యాపార కుటుంబాల నుంచి వచ్చినవారే. ఈ క్రమంలో కమల్‌కాంత్ తల్లి ఒక రోజు అకస్మాత్తుగా కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కమల్‌కాంత్ కూడా కడుపునొప్పితో బాధపడ్డాడు. ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. దీంతో ఆసుపత్రికి వెళ్లిన అతడిని పరీక్షించిన వైద్యులు అతడి రక్తంలో ఆర్సెనిక్, థాలియం స్థాయులు అధికంగా ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. మానవ శరీరంలో ఈ లోహాలు చేరడం అసాధారణమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు.
ఈ క్రమంలో బాంబే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబరు 19న కమల్‌కాంత్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత అకస్మాత్తు మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాత అందులో కుట్ర దాగివున్నట్టు అనుమానించి కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కవిత, కమల్‌కాంత్ బాల్య స్నేహితుడు హితేశ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు.
బాధితుడి మెడికల్ రిపోర్టు, బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంతోపాటు కమల్‌కాంత్ తీసుకునే ఆహారం గురించి సేకరించిన విషయాలు కుట్రను బయటపెట్టినట్టు పోలీసులు తెలిపారు. హితేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత.. భర్త కమల్‌కాంత్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఒక్కసారిగా చంపేస్తే అందరికీ అనుమానం వస్తుందని భావించి.. ప్రియుడితో కలిసి భర్త తినే ఆహారంలో కొద్దికొద్దిగా విషం కలుపుతూ వచ్చింది. అది నెమ్మదిగా అతడి మృతికి కారణమైంది. కమల్ కాంత్ తల్లి కూడా కడుపు నొప్పితో బాధపడి మృతి చెందడంతో ఆమెకు కూడా స్లోపాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అరెస్ట్ అయిన కవిత, హితేశ్‌లకు కోర్టు ఈ నెల 8 వరకు పోలీసు కస్టడీ విధించింది.