అప్ఘానిస్తాన్ లో ఐఎస్ఐఎస్ తన ఉనికిని చాటుకొనే ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడి తమ పనేనని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ప్రకటించింది. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ఓ సెక్యూరిటీగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఇస్లామిక్ స్టేట్ రీజనల్ చాప్టర్ నిన్న ఓ ప్రకటన చేస్తూ.. మతభ్రష్ట పాకిస్థాన్ రాయబారి, అతడి గార్డులపై దాడి చేసింది తామేనని ప్రకటించింది.
ఆఫ్ఘనిస్థాన్‌లోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ స్పందించారు. దానిని హత్యయత్నంగా పేర్కొన్నారు. ఈ దాడిపై విచారణకు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కాబూల్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. అనుమానితుడిని అరెస్ట్ చేశామని, రెండు తేలికపాటి ఆయుధాలను సీజ్ చేసినట్టు చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ గుర్తించనప్పటికీ అక్కడ మాత్రం తమ రాయబార కార్యాలయాన్ని నడుపుతూ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఎంబసీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇళ్ల మధ్య నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చిన సాయుధుడు కాల్పులు జరిపాడని, రాయబారి, ఇతర సిబ్బంది ఈ కాల్పుల నుంచి సురక్షితంగా బయటపడినట్టు చెప్పారు. ఈ ఘటనను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఖండించింది.