బస్సు కోసం ఎదరుచూస్తుంటే ట్రక్ రూపంలో మరణం వచ్చింది. మధ్యప్రదేశ్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు కోసం ఎదురుచూస్తూ బస్ స్టాప్ లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకొచ్చింది. కన్నుమూసి తెరిచేలోపే దారుణం జరిగిపోయింది. ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులోనూ పలువురి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలోని రత్లాం జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ దారుణ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అకస్మాత్తుగా ఎడమవైపు తిరిగి, రోడ్డు పక్కనే ఉన్న బస్ స్టాప్ లో నిల్చున్న వారిని ఢీ కొట్టి ఆగింది. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టడంతో ఆ యువకుడు ఎగిరి కిందపడడం, ఆ యువకుడి పై నుంచే ట్రక్కు వెళ్లడం కనిపించింది. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.