ఓ కీలక నిర్ణయంతో కేళర సర్కార్ తాజాగా దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు ఈ ప్యానెల్ సభా కార్యకలాపాలను నియంత్రిస్తుంది. మహిళలు అన్నింటా సమానమని, విద్య, వైద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుకుంటున్నారని కేరళ ప్రభుత్వం పేర్కొంది.
అయితే రాజకీయాల్లో మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యత దక్కడంలేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేసేలా మహిళా స్పీకర్ ప్యానెల్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. అధికార పక్షం తరఫున ఎమ్మెల్యేలు యు.ప్రతిభ, సీకే ఆషా, ప్రతిపక్షాల తరపున ఎమ్మెల్యే కేకే రెమలతో ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. కాగా, కేరళ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు కొనసాగనున్న సమావేశాలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకుంటే మహిళా ప్యానెల్ సభను నడుపుతుంది.