వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాదిరిగా ‘‘ఈడీ నోటీసులు ఇచ్చిందనగానే మా పార్టీలో ఎవరూ ఫోన్లు పారేసుకోలేదు. మద్యం స్కాంలో శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేయగానే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంత భయం టీడీపీలో ఎవరికీ లేదు’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వ్యాఖ్యానించారు. ఆయన తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నైపుణ్య శిక్షణకు సంబంధించి సీఐడీ పెట్టిన కేసుపై రొటీన్‌గా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆర్థిక అంశాలపై ఏ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఈడీ తాను కూడా నోటీసులు జారీ చేసి విషయాలు తెలుసుకుంటుంది. ఈడీ నోటీసులు ఇవ్వడం తప్ప ఏ విచారణా చేయలేదు. నోటీసులు అందుకొన్నవారు ఈడీ అధికారుల ముందు హాజరై వారు అడిగిన సమాచారం ఇస్తారు. మేము ఎలాంటి విచారణకైనా సిద్ధంగానే ఉన్నాం అని ధీమా వ్యక్తపరిచారు.