గుంటూరుజిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో సోమవారం రాత్రి ఘోరం జరిగిందీ . కృష్ణా జిల్లా మానికొండ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడు గతంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. రెండేళ్ల నుంచి విజయవాడలో ఉంటూ వర్క్‌ఫ్రమ్ హోం చేస్తున్నాడు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (20) అనే యువతి విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న జ్ఞానేశ్వర్, తపస్విల మధ్య నాలుగునెలల క్రితం మనస్పర్థలు వచ్చాయి. జ్ఞానేశ్వర్... తపస్విని వేధింపులకు గురిచేస్తుండేవాడు. అతని వేధింపులు తాళలేక ఒక దశలో విజయవాడలో పోలీసులకు తపస్వి ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో తన స్నేహితురాలి ఇంటివద్ద ఉండేందుకు పదిరోజుల క్రితం గుంటూరు జిల్లా తక్కెళ్లపాడుకు వెళ్లింది. ఎట్టకేలకు ఆమె జాడను జ్ఞానేశ్వర్ తెలుసుకున్నాడు. సోమవారం రాత్రి తపస్వి వద్దకు వచ్చి తనను ప్రేమించాలని, తననే పెళ్లిచేసుకోవాలని బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో దాడికి దిగాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడును తీసాడు. తపస్వి గొంతు కోసేశాడు. వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగానే, ఆమె స్నేహితురాలు భయంతో పెద్దగా కేకలు పెడుతూ, బయటకు పరుగులుతీసి చుట్టుపక్కలవారిని తీసుకుని వచ్చారు. అయితే, అప్పటికే ఘోరం జరిగిపోయింది. వారినీ జ్ఞానేశ్వర్ బెదిరించే ప్రయత్నం చేశాడు. దగ్గరకు వస్తే తన చేతిలోని కత్తితో దాడిచేస్తానంటూ హెచ్చరించాడు. అయినా, స్థానికులు గట్టిగా ప్రతిఘటించి అతన్ని పట్టుకున్నారు. అప్పటికే బాగా రక్తస్రావమై అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన తపస్విని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి చేరకముందే తపస్వి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని పెదకాకాని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తపస్వి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడిపై పెదకాకాని పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.