ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఏడేళ్ల క్రితం హత్యకు గురైనట్లు కోర్టు నిర్ధారించిన బాలిక తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఎంచక్కా కాపురం చేస్తోంది. 2015లో ఓ బాలిక(14) కనిపించకుండా పోయింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి సమీపంలో ఉంటూ.. రోజుకూలీగా పనిచేసే విష్ణు అనే యువకుడిని అనుమానితుడిగా పేర్కొన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆగ్రాలో ఓ 14 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. అది తన కుమార్తె శవమేనంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. అంతే.. విష్ణుపై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు అతనికి హత్య కేసు కింద శిక్ష విధించింది. కాగా, విష్ణు చంపేశాడని పోలీసులు పేర్కొంటున్న బాలిక 2015లో తన ప్రియుడితో కలిసి పారిపోయిందని, అతణ్ని పెళ్లి చేసుకుని కాపురం చేస్తోందని.. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని విష్ణు బంధువులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.