పీఎం స్వానిధి కింద రుణాలు పొందిన వీధి వ్యాపారుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పీఎం స్వానిధి కింద రుణాలు పొందిన వీధి వ్యాపారుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం స్వానిధి కింద మొదటి విడతలో 12, 364 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున రూ. 12. 36 కోట్ల రూపాయల రుణాలు అందజేయగా, రెండవ విడుతలో ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు చొప్పున 2, 596 మందిలో 1, 695 మందికి 3 కోట్ల 39 లక్షల రూపాయలకుపైగా రుణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పీఎం స్వానిధి కింద రుణాలు పొందిన వీధి వ్యాపారాల కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం జన్ ధన్ యోజన, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన, పిఎం శ్యామ్ యోగి మాన్ ధన్ యోజన, జననీ సురక్ష యోజన, మాతృ వందన యోజన, తదితర పథకాల కింద లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం స్వానిధి కింద రుణాలు పొందిన వీధి వ్యాపారాల కుటుంబ సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, వారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీలలో సర్వే చేపట్టాలని, సర్వే ని నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు అందరూ సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.
ఈ విషయమై ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని మున్సిపాలిటీ ల వారిగా వీధి వ్యాపారాల కుటుంబ సభ్యులను సర్వే చేసేందుకు కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈనెల 13వ తేదీలోపు కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.