బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంఓ అధికారుల సమావేశంలో తుపాను పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.