విశాఖపట్నం సమీపాన దువ్వాడ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం రైలు దిగబోతూ ఓ విద్యార్థిని కాలు జారడంతో ప్లాట్ఫారానికి, రైలు బోగీకి మధ్య ఇరుక్కుపోయింది. ఓ వైపు బయటికి రాలేక.. మరోవైపు తీవ్ర ఆందోళనతో విలవిల్లాడిపోయింది. రైల్వే సిబ్బంది అతి కష్టంపై ఆమెనుబయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్ళితే...... తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నానికి చెందిన మెరపాల శశికళ (20) దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలో ఎంసీఏ చదువుతోంది. రోజూ అన్నవరం నుంచి రైలులో వచ్చి వెళుతోంది. బుధవారం కూడా అన్నవరంలో గుంటూరు-రాయగడ పాసింజర్ (17243) ఎక్కింది. ఉదయం 8.20 గంటలకు రైలు దువ్వాడ చేరుకుంది. శశికళ రైలు నుంచి దిగుతుండగా కాలు జారి ప్లాట్ఫారానికి, రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. తోటి ప్రయాణికులు గమనించి కేకలు వేయడంతో రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్లాట్ఫారంలోని రెండు బ్లాకులను విరగ్గొట్టి, ఆమెను పైకి తీసి ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామని, పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.