కాంగ్రెస్ ను ఆప్ దెబ్బతీసిందని... తమ పార్టీ ఓట్లను ఆప్ చీల్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చెప్పారు. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. తన రికార్డులను తానే బద్దలు కొడుతూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 182 అసెంబ్లీ స్థానాల్లో 158 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. హస్తం పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో కాంగ్రెస్ తరపున తాను ప్రచారం చేయలేదని... కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో కూడా తాను లేనని ఆయన చెప్పారు. ఎన్నికల కార్యక్షేత్రంలోకి తాను అడుగే పెట్టలేదని... అందువల్ల ఈ ఫలితాలపై తాను ఏమీ మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో గాంధీలకు విధేయుడైన మల్లికార్జున ఖర్గేపై శశిథరూర్ పోటీ చేసిన తర్వాత ఆయనను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల క్యాంపెయినర్ల జాబితా నుంచి తొలగించారు.
అధికారంలో ఉన్న పార్టీపై ప్రజా వ్యతిరేకత ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు కలిసొస్తుందని భావించామని... అయితే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే అది జరిగిందని, గుజరాత్ లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని శశి థరూర్ అన్నారు.