ఉచితాలు ఇస్తామనే వారు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు తమకు వద్దని గుజరాత్ స్పష్టంగా చెప్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీజేపీ పక్షాన రాష్ట్రం నిలిచిందని చెప్పారు.
ఢిల్లీ వెలుపల పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఊపులో గుజరాత్ లో సైతం సత్తా చాటాలని యత్నించింది. ఈ క్రమంలో గుజరాత్ ఎన్నికల ప్రచారం సమయంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎన్నో ఉచిత పథకాల హామీలను గుప్పించారు. ఆల్ ఫ్రీ అన్నట్టుగా మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ మాత్రం ఉచితాల జోలికి వెళ్లలేదు. ఎన్నో ఫ్రీబీస్ ప్రకటించినప్పటికీ ఆప్ కు గుజరాత్ ప్రజల నుంచి మద్దతు లభించలేదు. 182 స్థానాలకు గాను కేవలం ఐదు స్థానాల్లోనే ఆప్ ఆధిక్యంలో ఉంది.
ఈ నేపథ్యంలో ఆప్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. ఉచితాలను ప్రకటించిన వారిని గుజరాత్ తిరస్కరించిందని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి గుజరాత్ అపూర్వమైన విజయాన్ని అందించిందని చెప్పారు. మహిళలు, యువత, రైతులు అందరూ కూడా బీజేపీనే మనస్పూర్తిగా కోరుకున్నారనే విషయం ఎన్నికల ఫలితాలతో వెల్లడయిందని అమిత్ షా అన్నారు. గుజరాత్ ఎప్పుడూ కూడా చరిత్ర సృష్టిస్తూనే ఉంటుందని చెప్పారు. మోదీ నాయకత్వంలో గత రెండు దశాబ్దాల కాలంలో అభివృద్ధికి సంబంధించిన అన్ని రికార్డులను గుజరాత్ బద్దలు కొట్టిందని.. అందుకే గుజరాత్ ప్రజలు బీజేపీని గెలుపుతో ఆశీర్వదించారని అన్నారు. నరేంద్ర మోదీ అభివృద్ధి మోడల్ పై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ గెలుపు నిదర్శనమని చెప్పారు.