మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదటగా స్వాగతించేది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని, కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా పార్టీ, మా ప్రభుత్వ విధానమని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి చివరి క్షణం వరకు వైయస్‌ఆర్ సీపీ చిత్తశుద్ధితో పోరాటం చేసిందని గుర్తుచేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవన్నారు. విభజన సమయంలో అన్యాయం చేసింది ఉండవల్లి అరుణ్‌కుమార్ ఉన్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలే అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.