సింహాచలం సమీపంలోని ఓ కాలనీలో నివాసం వుంటున్న యువతి నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆర్కిటెక్చర్ కోర్సు తృతీయ సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఏడాది కిందట మండలంలోని జుత్తాడకు చెందిన కె.భార్గవ్ (20) అనే యువకుడితో పరిచయమైంది. ఓ ప్రైవేటు కాలేజీలో బీబీఎం చదువుతున్న భార్గవ్ ఆ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే భార్గవ్ చెడు వ్యసనాలకు బానిసై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలుసుకున్న ఆ యువతి అతన్ని దూరం పెట్టింది. దీనిని సహించలేని భార్గవ్ ఆ యువతి సెల్ ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో పాటు తనతో సాన్నిహిత్యంగా వున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించసాగాడు. దీంతో ఆ యువతి ఈ నెల ఐదున తన సోదరుడితో కలిసి భార్గవ్ ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి ఇక్కడితో తనను వదిలిపెట్టాలని వేడుకుంది. అయినప్పటికీ భార్గవ్ ఆ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో వారు వెనుదిరిగారు. ఆ మర్నాడు భార్గవ్ తల్లి ఉషారాణి ఈ విషయమై యువతి ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగింది. దీంతో యువతి కుటుంబసభ్యులు ‘100’కు డయిల్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై అత్యాచారం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.