రోజురోజుకు మనషుల్లో నేర మనస్తత్వం కొత్త పుంతలు తొక్కుతోంది.ఇటీవల జరిగిన ఓ హత్య అలాంటి నేర మనస్తత్వానికి నిదర్శనంగా నిలిచింది. భూమి విషయంలో వైరం కారణంగా మేనమామ కుమారుడ్ని స్నేహితులతో కలిసి నరికి చంపేశాడు ఓ గిరిజన యువకుడు. అంతటితో ఆగకుండా మొండెం నుంచి వేరుచేసిన తలతో నిందితులంతా కలిసి సెల్ఫీలు దిగారు. ఝార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముర్హా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ముర్హాకు చెందిన దసాయ్ ముండా డిసెంబరు 2న ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు, అతడి భార్య సహా ఆరుగుర్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
‘డిసెంబరు 1న దసాయ్ ముండా కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లిపోగా.. వారి కుమారుడు కను ముండా ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నాడు. కుటుంబసభ్యులు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి కుమారుడు కనిపించలేదు. దసాయ్ మేనల్లుడు సాగర్ ముండా, తన స్నేహితుతో వచ్చి కునును అపహరించినట్లు గ్రామస్థులు తెలిపారు. తన కుమారుడి జాడ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత మర్నాడు ఉదయం పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. కును ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు’ అని పోలీసులు తెలిపారు.
నిందితులను పట్టుకునేందుకు ఖుంతి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అమిత్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన తరువాత కుమాంగ్ గోప్లా అడవిలో మొండెం, అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దుల్వా తుంగ్రీ ప్రాంతంలో తల గుర్తించినట్టు ముర్హు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చూడామణి తుడు తెలిపారు. వేరుచేసిన తలతో నిందితులు సెల్ఫీలు తీసుకున్నారని అన్నారు. హతుడికి సంబంధించి మొబైల్ సహా ఐదు ఫోన్లు, రక్తపు మరకలతో ఉన్న పదునైన ఆయుధాలు, ఓ గొడ్డలి, ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నట్టు తుడు పేర్కొన్నారు. ఓ భూమి విషయంలో మృతుడి కుటుంబానికి, నిందితులకు మధ్య చాలా కాలంగా ఉన్న వైరమే ఈ హత్యకు కారణమని అధికారి తెలిపారు. నిందితులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని చెప్పారు.