గ్యాస్ సిలిండర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేసే ఘటన ఓ వివాహా వేడుకలో చోటుచేసుకుంది. విందుకోసం వంటకాలు సిద్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఇంటిలో మంటలు అంటుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది వరకూ అతిథులు గాయపడ్డారు. విషాదకర ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్ జిల్లా భుంగ్రా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గాయపడినవారు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జోధ్‌పూర్‌కు తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజిన్‌తో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
జోధ్‌పూర్ కలెక్టర్ హిమాన్షు గుప్తా మాట్లాడుతూ.. గురువారం భుంగ్రా నుంచి వరుడి ఊరేగింపు ప్రారంభం కావడానికి ముందు ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగి ఇళ్లంతా వ్యాపించాయని చెప్పారు. చాలా తీవ్రమైన ప్రమాదం జరిగిందని, గాయపడిన 60 మందిలో 42 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. వీరిని చికిత్స కోసం ఎంజీహెచ్ ఆస్పత్రి తరలించామని పేర్కొన్నారు. ఘటనా స్థలిలోనే నలుగురు చనిపోయారని వివరించారు.
అప్పటి వరకూ బంధువులు, చుట్టాలు, స్నేహితులతో కళకళలాడిన ఆ ఇళ్లు.. ప్రమాదంతో ఒక్కసారిగా భీతావాహనంగా మారిపోయింది. బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎంపీ హనిమాన్ బేనీవాలా ఎంజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, బాధిత కుటుంబాలకు రూ.25 - రూ.50 లక్షల వరకూ పరిహారం అందించాలని, ఈరోజే ముఖ్యమంత్రి దానిని ప్రకటించాలని ఆయన కోరారు.
అలాగే 40 శాతం వరకూ గాయాలైన బాధితులకు సరైన వైద్యం అందజేయడానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. అటు, ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.