వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకే ‘వారాహి’ వాహనం తీసుకుని వచ్చామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళం, విశాఖల్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం, ఆయన సలహాదారులు రాష్ట్ర సంక్షేమాన్ని విస్మరించి.. కేవలం జనసేనపై దృష్టిసారించారని మండిపడ్డారు. జనసేన వాహనంపై చూపిస్తున్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. జనవాణి ద్వారా అందిన వినతులమేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని, యువతకు భరోసా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఇందుకుగాను జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ‘యువశక్తి’ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ సమావేశంలో పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, పెదపూడి విజయకుమార్ పాల్గొన్నారు.