బోరు బావి ఘటనలు దాదాపు విషాధంగానే ముగిసిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని మాండవి గ్రామంలో విషాదం నెలకొంది. గత మంగళవారం రాత్రి ఎనిమిదేళ్ల బాలుడు ఆడుకుంటూ 55 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. ఆ విషయాన్ని గమనించిన చిన్నారి అక్క వెంటనే తన తండ్రికి చెప్పింది. వెంటనే వారు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో బాలుడు బతికే ఉన్నాడు. అతను చేస్తున్న శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు. బోర్ వెల్ లోపల కెమెరాను అమర్చి బాలుడి కదలికలను పర్యవేక్షించారు. ఆక్సిజన్ సరఫరా కూడా చేశారు. చిన్నారిని తీసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఈరోజు చిన్నారిని బోరుబావి నుంచి వెలికి తీశారు. వెంటనే అంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి చనిపోయాడని వైద్యులు తెలిపారు.
నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా రెస్కూ ఆపరేషన్ కొనసాగింది. పెద్ద పెద్ద రాళ్లు ఉండటంతో రెస్కూ ఆపరేషన్ రోజుల పాటు కొనసాగిందని అధికారులు తెలిపారు. ఒక టన్నెల్ ను తవ్వడం ద్వారా బాలుడిని కాపాడాలని అధికారులు యత్నించారు. అయితే రాళ్ల వల్ల రోజుల తరబడి సమయం తీసుకుంది. దీంతో, చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.