తమ రాజకీయాల కోసం తరచూ పార్టీలు మారే వారికి ఇదో హెచ్చరిక. కార్యకర్తల ఆందోళనతో ఆప్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు తీరిగి హస్తం పార్టీ గూటికి వచ్చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరిన కొన్ని గంటలకే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహదీ మనసు మార్చుకున్నారు. శనివారం వేకువజామున తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ తాను రాహుల్ గాంధీ కార్యకర్తనని పేర్కొన్నారు. తనతోపాటు ‘ఆప్’లో చేరిన ముస్తాఫాబాద్, బ్రిజిపూర్ కౌన్సిలర్లు సబీలా బేగం, నజియా ఖాతూన్‌లు తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్టు మెహదీ ప్రకటించిన వెంటనే ముస్తాఫాబాద్‌లో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెహదీ పాములాంటోడని కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అభివర్ణించారు. ఆ తర్వాత కాసేపటికే మెహదీ తిరిగి కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. తిరిగి పార్టీలోకి వచ్చిన మెహదీకి పార్టీ నేతలు ఆన్‌లైన్ ద్వారా తమ మద్దతు తెలిపారు. ఇదిలావుంటే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 250 స్థానాలకు గాను 134 స్థానాలకు కైవసం చేసుకుని ఎంసీడీ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 9 సీట్లను మాత్రమే గెలుచుకుంది.