ఒకపుడు అమనాలకు గురవుతూ వస్తున్న ట్రాన్స్ జెండర్లును ప్రస్తుతం మనదేశంలోని వివిధ రాష్ట్రాల సర్కార్లు తగిన విధంగా గౌరవిస్తున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు ట్రాన్స్ జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు ఆన్ లైన్ అప్లికేషన్ విధానంలో అవసరమైన మార్పులు చేస్తామని హైకోర్టుకు వివరణ ఇచ్చింది. అదేవిధంగా దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని శనివారం కోర్టుకు తెలిపారు. అంతకుముందు రోజే హైకోర్టు బెంచ్ ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో ట్రాన్స్ జెండర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని దాఖలైన పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారిస్తోంది. హైకోర్టు సీజే జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ ఆహుజా ల బెంచ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ట్రాన్స్ జెండర్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో స్పందించిన షిండే సర్కారు.. కానిస్టేబుల్ గడువు తేదీని పొడిగించింది. ఆన్ లైన్ దరఖాస్తులో స్త్రీ, పురుషులతో పాటు మూడో కేటగిరీని చేర్చనున్నట్లు వివరించింది. ఈ నెల 13 లోపు వెబ్ సైట్ లో మార్పులు చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పిస్తామని హైకోర్టుకు తెలిపింది.