ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఉండబోవని భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ సొంతం చేసుకోగా.. తాము ఈ టోర్నీ కోసం పాక్ కు వెళ్లేది లేదని బీసీసీఐ కొన్ని రోజుల కిందట స్పష్టం చేసింది.
టీమిండియా ఈ టోర్నీ కోసం తమ దేశానికి రాకుంటే.. భారత్ లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ ను బాయ్ కాట్ చేస్తామని పాక్ క్రికెట్ బోర్డ్ హెచ్చరించింది. అప్పటి నుంచి బీసీసీఐ, పీసీబీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే, ఓ టీవీ షోలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయంపై మాట్లాడారు.
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మారనున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి. కానీ, మా ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో మీకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది సంక్లిష్టమైన సమస్య. నేను మీ తలపై తుపాకీ పెడితే.. మీరు నాతో మాట్లాడతారా? పొరుగువారు బహిరంగంగా ఉగ్రవాదానికి సహాయం చేస్తున్నారు. దీనికి నాయకులు ఎవరు, శిబిరాలు ఎక్కడ ఉన్నాయనేది రహస్యం ఏమీ కాదు’ అని పాక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
ఇదిలావుంటే పాకిస్థాన్ మనదేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్న రాజకీయ ఆరోపణల నేపథ్యంలో.. ఆ దేశంతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను బీసీసీఐ తెంచుకుంది. టీమిండియాను పాక్ కు అనుమతించడం లేదు. అలాగే ఆ జట్టును మన దేశానికి ఆహ్వానించడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ లో మాత్రమే భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేందుకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.