ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు: కేవీపీ రామచంద్రరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 08:36 PM

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్థిరపరచి.. భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఆగ్రహంవ్యక్తంచేశారు. బంగారు భవిష్యత్‌ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో జగన్‌ అసలు పోరాడడం లేదని విమర్శించారు. అలాగే, ప్రత్యేక హోదా కోసం కూడా కేంద్రాన్ని జగన్‌ నిలదీయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం దశదిశ మారేదని.. కానీ, ఇప్పుడు దాని దుస్థితి చూస్తుంటే బాధేస్తోందని కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.


బంగారు భవిష్యత్తు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఏపీ కాంగ్రెస్‌ సమన్వయ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కేవీపీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 


పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చట్టంలో ఉన్నా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిర్మాణ బాధ్యతలు తీసుకోవడాన్ని కేవీపీ తప్పుబట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు పోలవరాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అలాగే, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నా.. ఆపేందుకు ప్రయత్నించడం లేదని ధ్వజమెత్తారు.


పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లక్ష్యమని కేవీపీ అన్నారు. కానీ, వైఎస్సార్ ఆశయ సాధన కోసం, వీటిని నెరవేర్చడానికి జగన్‌ ప్రయత్నించలేదని కేవీపీ దుయ్యబట్టారు. బీజేపీకి దగ్గరై రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీస్తున్నారని ఆక్రోశించారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్‌ లేదని బాధపడాల్సిన అవసరం లేదని.. ఒంటరిగా పోరాటం చేస్తూ ప్రజల్లోకి వెళ్తే 2024లో కాకున్నా.. 2029 నాటికైనా కాంగ్రెస్‌ తన సత్తా చాటుకుంటుందని కేవీపీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలంటే.. ఐక్యతతో ముందుకు సాగాలని కేవీపీ సూచించారు.


గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి, తనకు మధ్య జరిగిన ఓ ఒప్పందాన్ని కాంగ్రెస్ నేత కేవీపీ గుర్తు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి, తనకు కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా భవిష్యత్‌ ఇచ్చిందని కేవీపీ తెలిపారు. 1978 నుంచి తమకు అనేక పదవులు కట్టబెట్టిందన్నారు. అలాంటి పార్టీని వీడకూడదని, ఏనాడూ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని.. పల్లెత్తుమాట అనకూడదని 1996 లోనే రాజశేఖర్‌రెడ్డి, తానూ ఒట్టేసుకున్నామని తెలిపారు. తాను చివరి వరకు కాంగ్రె‌స్‌ పార్టీతోనే ఉంటానని తేల్చి చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa