మాండూస్ తుఫాను సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పంట చేతికొచ్చిన తరుణంలో మాండూస్ తుఫాను వల్ల వేలాది ఎకరాల పంట నీటిపాలై రైతాంగం కుదిలైందన్నారు. చాలా ప్రాంతాల్లో కల్లాల్లోని ధాన్యం నీట మునిగిందని తెలిపారు. అధికార యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని తమరు చెప్పినప్పటికీ, కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉండటం విచారకరమన్నారు. తమ పార్టీ పార్లమెంటరీ నాయకులు, ఎంపీ బినాయ్ విశ్వం కడప కలెక్టరేట్‌ను సందర్శించినప్పుడు అధికారులు ఎవరూ లేరని తెలిపారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.