తుఫానుతో పంటలు దెబ్బతిని, రైతులు బాధపడుతుంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రావటం లేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా అయన మాట్లడుతూ.... ‘‘వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలు నీట మునిగాయి. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ మంత్రి పేకాట క్లబ్బులు, కల్తీ మద్యం వ్యాపారంలో, ఎమ్మెల్యేలు ఎవరి దందాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. రైతు సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు. ధాన్యం కొనుగోలు చేయలేక వరి సాగు చేయొద్దని మంత్రి వ్యాఖ్యానించడం చేతకాని తనానికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు అంటూ ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలు కనీసం 175 మంది రైతుల్ని అయినా ఆదుకోవాలి. టీడీపీ హయాంలో పంట కొనుగోలుకు మూడు దశలు ఉంటే, నేడు 18 దశలు పెట్టారు’’ అని అనగాని విమర్శించారు. ఇదే అంశంపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివారం నర్సీపట్నంలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్రం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు.