తక్షణ రుణం పేరుతో ఇన్‌స్టాంట్ లోన్ యాప్‌లు సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు, బలవంతపు వసూళ్లను అణచివేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో సోమవారం ఆయన ఈ అంశంపై మాట్లాడారు. అర్థిక అవసరాలతో ఇబ్బందులు పడే అమాయకులకు తక్షణమే రుణం ఇస్తామంటూ లోన్ యాప్‌లు ఆకర్షిస్తాయి. లోన్ కోసం ఈ యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసిన వారి ఫోన్ నుంచి సున్నితమైన మెసేజ్‌లు, కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలను సేకరించి వారికి రుణం మంజూరు చేస్తారు. రుణం మొత్తం చెల్లించిన తర్వాత కూడా అధిక మొత్తంలో వడ్డీ, ఇతర చార్జీలు బకాయిపడినట్లుగా చూపిస్తారు. బకాయిలు చెల్లించడానికి నిరాకరించే రుణగ్రహీతలను బ్లాక్‌మెయిల్ చేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడటం ఈ లోన్ యాప్‌లు అవలంభించే విధానమని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ లోన్ యాప్‌లు అత్యధికంగా చైనా నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆమోదం లేకుండానే ఈ లోన్ యాప్‌లు యథేచ్చగా తమ అక్రమ ఫైనాన్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు.