ఏపీ సీఎం జగన్ సోమవారం మాండూస్ తుఫాన్, భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు ఎన్యుమరేషన్ విధానంలో ఉదారంగా వ్యవహరించాలని అన్నారు. రైతులు నిరాశకు గురికాకూడదని, రంగుమారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న చోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే రూ.2 వేలు, రేషన్ అందించాలన్నారు. ఇంటిలోనికి నీళ్లు వచ్చిన వారికి సహాయాన్ని అందించాలన్నారు. నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని, వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మరణించిన వారికి వెంటనే పరిహారం అందించాలన్నారు.