తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల(ఎంసీఎల్ఆర్) ను పెంచేసింది. అంటే రుణ ఆధారిత వడ్డీ రేటు అన్న మాట. ఏదైనా బ్యాంకు.. తమ వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఈ ఎంసీఎల్ఆర్ రేటునే ప్రాతిపదికగా, ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన నేపథ్యంలో ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం 25 నుంచి 30 బేసిస్ పాయింట్లుగా పేర్కొంది. కాలవ్యవధిని బట్టి వీటిల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు బిఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. 2022, డిసెంబర్ 12 నుంచి తాజా లెండింగ్ రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.
దీంతో ఓవర్‌నైట్ టెన్యూర్‌కు ఎంసీఎల్ఆర్ రేటు ప్రస్తుతం ఉన్న 7.25 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. ఇక ఒక నెల కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్రే టును 7.70 శాతం నుంచి 7.95 శాతానికి పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. 3 నెలల టెన్యూర్ ఉన్న ఎంసీఎల్‌ఆర్ రేటు 7.75 శాతం నుంచి 8.05 శాతానికి ఎగబాకింది. 6 నెలల టెన్యూర్ ఉన్న ఎంసీఎల్ఆర్7.90 శాతం నుంచి 8.15 శాతానికి చేరింది. ఇక ఒక సంవత్సరానికి చూస్తే ఎంసీఎల్‌ఆర్ రేటు 8.05 శాతం నుంచి 8.30 శాతానికి పెరిగింది.
బ్యాంకులు కస్టమర్లకు అందించే రుణాలపై కనీస లెండింగ్ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. వేర్వేరు రకాల లోన్లకు సంబంధించి వడ్డీ రేట్లను నిర్ణయించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో ఎంసీఎల్ఆర్ ను తీసుకొచ్చింది. బ్యాంకులు పారదర్శకంగా, పోటీతత్వంగా లోన్లను అందించేందుకు దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎంసీఎల్‌ఆర్‌లో ఏ మార్పు జరిగినా.. అది నేరుగా కస్టమర్లపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇది వెంటనే రుణ వడ్డీ రేట్ల పెంపును సూచిస్తుంది. లోన్లపై ఇంట్రెస్ట్ రేటు పెరిగితే అదే క్రమంలోఈఎంఐ లు కూడా పెరుగుతాయి. అప్పుడు ఎంసీఎల్ఆర్లింక్డ్ ఉన్న లోన్లపై ఈఎంఐ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటును మరో 35 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. మొత్తం రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఈ ఒక్క సంవత్సరమే రెపో రేటు 2.25 శాతం మేర పెరిగింది. దీంతో బ్యాంకులు వేర్వేరు లోన్లపై వడ్డీ రేటును పెంచనున్నాయి. ఇదే క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ ఎక్కువగా ఆఫర్ చేస్తాయి.