జనవరి ఒకటో తేదీ నుంచి దేశంలోని యువతకు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వాలని ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారికి ఉచితంగా కండోమ్‌లు అందించనున్నట్టు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఫ్రాన్స్‌లో ఎయిడ్స్, ఇతర లైంగిక సంక్రమిత వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అవాంఛిత గర్భధారణను అరికట్టేందుకు కూడా ఈ ఉచిత కండోమ్‌లు ఉపయోగపడతాయని ప్రభుత్వం యోచిస్తుంది.
నిజానికి ఫ్రాన్స్‌ను 2030 నాటికి హెచ్‌ఐవీ కేసుల రహితంగా మార్చాలని ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ధ్యేయంగా పట్టుకున్నారు. 2020-2021 లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్ల కేసులు 30 శాతం పెరిగినట్టు తెలుస్తుంది. అయితే 2021లో దాదాపు ఐదు వేల కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు 30 లక్షల మంది బాలికలు, మహిళలు లబ్ధి పొందనున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. లైంగిక విషయాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫ్రాన్స్‌లో ప్రతి నలుగురిలో ఒకరు కొత్త భాగస్వామితో శృంగారంలో ఉన్నప్పుడు కండోమ్‌లను ఉపయోగించరని తెలుస్తుంది.