ఇటీవల విమానాశ్రయాలలో ఆసక్తీకర ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో ఓ వ్యక్తి అందరిని ఆశ్చర్యంలో పడేశాడు. ఎయిర్‌పోర్టులో అధికారులకు ఊహించని అనుభవం ఎదురైంది. విమానంలోకి లగేజ్‌ను లోడ్ చేసే ముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను స్కాన్ చేసిన సిబ్బంది విస్తుపోయారు. ఎందుకనుకుంటున్నారా..? సాధారణంగా లగేజ్‌లో దుస్తులు, వస్తువులు ఉంటాయి. కానీ అతని బ్యాగ్‌లో కుక్క ఉంది. అది కూడా బతికున్న శునకం. అది చూసిన సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
విస్కాన్ సిన్ నగరంలోని డేన్ కంట్రీ రీజనల్ ఎయిర్ పోర్టులో ఈ వినూత్న ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్ పోర్టు సిబ్బంది విమానంలోకి లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సందర్భంలో ఓ ప్రయాణికుడికి సంబంధించిన కాలేజీ బ్యాగ్‌ను ఎక్స్‌రే మెషిన్‌లోకి పంపించారు. అయితే అందులో గుర్తు పట్టలేని వస్తువును సిబ్బంది గుర్తించారు. లాభం లేదని బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. అందులో బతికున్న కుక్క కనిపించింది.
తర్వాత ఆ విషయాన్ని ఎయిర్ పోర్టు సిబ్బంది ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేశారు. దాంతోపాటు ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సమాచారం ఇవ్వాలని కోరారు. " ఏదైనా జంతువుతో ప్రయాణిస్తున్నప్పుడు మీ విమానయాన సంస్థకు తెలియజేయండి. వాటి నియమాలను తెలుసుకోండి. చెక్‌పాయింట్ దగ్గర మీ పెంపుడు జంతువును బ్యాగ్ నుంచి తీసేసి.. ఖాళీ క్యారియర్‌తో సహా అన్ని వస్తువులను మెషీన్‌లో పరీక్షించడానికి పెట్టండి." అని సూచించారు. ఈ పోస్టు పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.