తమ జీతాలు పెంచాలని కోరుతూ బ్రిటన్‌లో పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో రైల్వే, విమానం, బస్సు, అంబులెన్స్, నర్సింగ్, టీచింగ్ సిబ్బంది సహా వివిధ శాఖలకు చెందిన రెండు లక్షలకుపైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ పరిణామంతో బ్రిటన్‌లో అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. సమ్మె కారణంగా స్థానిక ప్రజలతోపాటు పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన రహదారులన్ని ఆందోళనకారులతో నిండిపోయాయి. జీతాలు పెంచాలని ఉమ్మడి లక్ష్యంతో ఈ నిరసన చేపట్టారు. ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలో తమ జీతాలు పెరగడం లేదని ఉద్యోగులు అంటున్నారు. బ్రిటన్‌లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటు 11.1 శాతంగా ఉంది. కానీ జీతాలను మాత్రం అంతంత మాత్రంగానే పెంచారు. నర్సింగ్ సిబ్బంది జీతం 4.75 శాతం, అంబులెన్స్ సిబ్బంది జీతం నాలుగు శాతం పెంచారు. పోస్టల్ ఉద్యోగులకు 9 శాతం వేతన పెంపును ఆఫర్ చేయగా వారు వద్దన్నారు. ఇలా వేతనాలను అనుకున్న స్థాయిలో పెంచకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు.
డిసెంబర్ 23 నుంచి గాట్విక్, హీత్రో, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, గ్లాస్గో, కార్డిఫ్‌లలో విమానాశ్రయ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గోనున్నారు. సమ్మె ప్రభావాన్ని నివారించేందుకు ఎయిర్‌పోర్టులు, ఓడ రేవుల దగ్గర సైన్యాన్ని మోహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 40 వేల మంది రైల్వే కార్మికులు డిసెంబర్ 13 నుంచి 17 వరకు, లక్ష మంది నర్స్‌లు డిసెంబర్ 15, 20 తేదీల్లో సమ్మెకు సిద్ధమవుతున్నారు. డిసెంబరు 21, 28 తేదీల్లో అంబులెన్స్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. క్రిస్మస్ పండుగ వేళలో ఈ సమ్మె జరుగుతుండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 30 ఏళ్లలో ఇదే అతి పెద్ద సమ్మెగా అందరూ భావిస్తున్నారు. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌కు ఈ సమ్మె ఒక సవాల్‌గా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.