హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఓ సామాన్యుడిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరికొత్త సందేశం పంపే ప్రయత్నం చేసింది. ఆప్ పార్టీ సామాన్యుడి పేరుతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయినా గుజరాత్ ఎన్నికల్లో మాత్రం రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ, మూడో స్థానంలో ఆప్ పార్టీ నిలిచింది. అయితే ఆప్ పార్టీ లేకపోతే గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు అంత ఘోరంగా ఉండేవి కావని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సామాన్యుల పార్టీ కాంగ్రెస్ అన్న సంకేతాలు ప్రజల్లో పంపేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖును కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందని ప్రచారం. హిమాచల్ కాంగ్రెస్‌లో మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబానిదే ఇప్పటి వరకూ ఆధిపత్యం. రాజ కుటుంబానికి చెందిన ఆయన ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా తమకే అధికారం కావాలని ఆయన సతీమణి ప్రతిభా సింగ్ పట్టుబట్టారు. అంతేకాదు, ఒకానొక సమయంలో అధిష్ఠానంపైనే ధిక్కార స్వరం వినిపించిన ఆమె.. సీఎం పీఠం రాజకుటుంబానికి దక్కకుంటే ఉపద్రవం తప్పదని హెచ్చరించారు. అయితే, వారి బెదిరింపులకు కాంగ్రెస్ హైకమాండ్ తలొగ్గక సామాన్యుడ్ని ఎంపిక చేసింది.
దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తే సీఎం అవుతారని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్టుయ్యింది. మొత్తం 40 మంది ఎమ్మెల్యేల్లో 25 మందిపైగా సుఖుకు మద్దతుగా ఉన్నారు. ఈ విషయం తెలిసి సీఎల్పీ భేటీకి ముందే ప్రతిభా సింగ్ సీఎం రేసు నుంచి తప్పుకున్నారు.
ఇక, హమీర్పూర్ జిలా నదౌన్ తాలుకాలోని సెరా గ్రామంలో 1964 మార్చి 26న సుఖ్వీందర్ సింగ్ జన్మించారు. ఆయన తండ్రి రసిల్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీలో డ్రైవర్ కాగా.. తల్లి సాధారణ గృహిణి. సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పూర్తిచేశారు. కమలా ఠాకూర్‌ను 98లో వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు అమ్మాయిలు. 17 ఏళ్ల వయసుకే విద్యార్ధి దశలో రాజకీయాల్లోకి వచ్చిన సుఖు.. హెచ్‌పీయూలో ఎన్ఎస్‌యూఐ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అనంతరం హిమాచల్ యువజన కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడయ్యారు. 1999 నుంచి 2008 వరకూ ఆ పదవిలో ఉన్నారు.
సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండు సార్లు కౌన్సెలర్‌గా ఎన్నికయ్యారు. తొలిసారి 2003 ఎన్నికల్లో నదౌన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2007,2017,2022 ఎన్నికల్లో అదే నియజకవర్గం నుంచి విజయం సాధించిన సుఖు.. 2012లో మాత్రం ఓడిపోయారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2013లో హిమాచల్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ నియంతృత్వ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో సుఖు కూడా ఒకరు. ఇరువురి మధ్య అనేక విషయాల్లో ప్రచ్ఛన్న యుద్దం జరిగింది.
ఒకదశలో ఆయనను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్ఠానంపై వీరభద్ర సింగ్ ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, హైకమాండ్ మాత్రం సుఖ్వీందర్‌కు మద్దతుగా నిలిచింది. 2019 జనవరి 10 వరకూ ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో సుఖును కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన సుఖ్వీందర్.. కాంగ్రెస్‌లో రాజ కుటుంబం ఆధిపత్యానికి చెక్ పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు.