వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రకృతి సంపదను నిలువునా దోచేశారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. పొదలకూరు పంచాయతీ పరిధిలోని 707 సర్వే నెంబరులో ఉన్న చిట్టేపల్లి తిప్పపై జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ను, తిప్ప కరిగిన తీరును ఆయన గురువారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రికి మండలంలో కుడి, ఎడమ చేతులుగా ఉంటున్న అధికార పార్టీ నాయకుల ధన దాహానికి తిప్పలు కరిగిపోతున్నాయని విమర్శించారు. సర్వే నెంబరు 707లో సుమారు 100 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోందన్నారు. స్థానికులు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఫిర్యాదు చేస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలవుతున్నాయన్నారు.