గుడివాడ కేసినో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడలో మూడు రోజులపాటు జరిగిన ఈ కేసినో రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం లేపిన విషయం తెలిసిందే. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ప్రమేయం... మద్దతుతోనే కేసినోను నిర్వహించారని, వందల కోట్ల మొత్తం అక్కడ చేతులు మారిందని టీడీపీ నేతలు ఆరోపించారు. కేసినో నిర్వహణకు సంబంధించిన ఫొటోలతో సహా వారు కొంత సమాచారంతో దీనిపై వివిధ దర్యాప్తు సంస్థలకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసినోను నిర్వహించిన చీకోటి ప్రవీణ్‌ను ఇటీవల ఈడీ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. ఈ నేపథ్యంలో గుడివాడ కేసినో నిర్వహణపై తన వద్ద ఉన్న సమాచారాన్ని తమకు అందచేయాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఐటీ అధికారులు వర్తమానం పంపారు. ఈ నెల 19న విజయవాడలో తమను కలవాలని ఆయనకు వారు సమాచారం పంపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.