అధిక పని ఒత్తిడి తగ్గించి మా ప్రాణాలు కాపాడండి’ అంటూ వీఆర్వోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేస్తామని తేల్చిచెప్పారు. ఇతర సమయాల్లో అధికారులు తమకు పనులు అప్పగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీఆర్వోలపై పని ఒత్తిడి, అధికారుల వేధింపులు, ఆత్మహత్యలపై విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, ఇతర పౌరసేవల్లో ముందుండే తమను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సర్వేలో జరిగే తప్పులకు తమను బాధ్యులను చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వీఆర్వోలు తీవ్ర ఒత్తిడికి గురై అనార్యోగ్యం పాలై మరణించడం, ఆత్మహత్యకు పాల్పడటం, విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాలకు గురవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల్లో వీఆర్వోలకు కావాల్సిన కంప్యూటర్ సిస్టమ్స్, స్టేషనరీ లేకుండా ఏవిధంగా విధులు నిర్వర్తించాలని ప్రశ్నించారు.