దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర మంటలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దేశంలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైనే పలుకుతోంది. ప్రభుత్వాల నుంచి సబ్సిడీ తగ్గడంతో గ్యాస్ బండ ధరకు రెక్కలొచ్చాయి. గ్యాస్ ధర గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతోంది. అయితే, రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహావసరాల గ్యాస్ సిలిండర్ ను రూ.500 కే ఇస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
ఈ తగ్గింపు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి వర్తిస్తుందని తెలిపారు. తగ్గింపు ధరతో ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తామని వెల్లడించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. అల్వార్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రసంగిస్తూ గెహ్లాట్ ఈ ప్రకటన చేశారు. దేశంలో ధరల పెరుగుదల తీవ్రస్థాయిలో ఉందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు ఎవరూ దూరం కారాదన్నది తమ ఆకాంక్ష అని వివరించారు.