బీసీ కార్పొరేషన్ ను టిడిపి నేతలు ముట్టడించారు. సోమవారం నాడు విజయవాడ గొల్లపూడిలోని బీసీ కార్పొరేషన్ భవనాన్ని టీడీపీ బీసీ సాధికారత కమిటీ సభ్యులు నేడు ముట్టడించారు. సాధికారత కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మూడున్నర సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో బీసీలకు దగా, వెన్నుపోటు తప్ప ఏమీ మిగలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
56 కార్పొరేషన్లు అంటూ వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించారు తప్ప 142 బీసీ కులాల్లోని రెండున్నర కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరికి పైసా ప్రయోజనం చేకూర్చలేదని మండిపడ్డారు. "వైసీపీ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం చేశాం, పెద్ద ఎత్తున నిధులిచ్చామని చెప్పుకుంటూ బీసీలను వంచించే కార్యక్రమాలు చేస్తోంది. బీసీ సంక్షేమ కార్యాలయం ముట్టడికి వస్తే కనీసం ఇక్కడ సమాధానం చెప్పేందుకు ఒక్క అధికారి కూడా లేకుండా... బీసీ కార్యాలయానికి తాళాలు వేసే పరిస్థితి నెలకొంది. ఇదేనా బీసీ సంక్షేమంపై మీకున్న చిత్తశుద్ధి?
మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి బీసీ వర్గాలన్నింటినీ మోసం చేశారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆదరణ పథకాల పనిముట్లను మూలన పడేశారు. గత ప్రభుత్వంలో బీసీ సబ్ ప్లాన్ నుంచి వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తే.. ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ రెడ్డి, మంత్రులు అబద్ధాలు ఆడుతూ బీసీలను మోసం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.
బీసీ సంక్షేమ భవనమని పేరు పెట్టారు గానీ ఉపయోగమేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు న్యాయం చేసే విధంగా పోరాడుతాం. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాం. బీసీలకు న్యాయం చేయకపోతే ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వకుండా అడ్డుకుంటాం" అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.