భారత మార్కెట్ లోకి కొత్త ఫోన్ల రాకతో సందడి కొనసాగుతోంది. తాజాగా చైనాకు చెందిన షావోమీ.. జనవరి 5న భారత మార్కెట్లో రెడ్ మీ 12 ప్రో సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీయే స్వయంగా ప్రకటించింది. అదే రోజు రెడ్ మీ 12 ప్రో ప్లస్ ను కూడా విడుదల చేయనుంది. ఈ ఫోన్లను షావోమీ అక్టోబర్ 28న చైనా మార్కెట్లో విడుదల చేయడం గమనార్హం.
రెడ్ మీ 12 ప్రో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ తో రానుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. ముఖ్యంగా డాల్బీ విజన్ టెక్ అనే సాంకేతికను ఈ ఫోన్లో వినియోగించారు. దీనివల్ల మెరుగైన వీక్షణ అనుభవం లభిస్తుందని షావోమీ అంటోంది. మీడియాటెక్ డెమెన్సిటీ 1080 చిప్ సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంటాయి. 6జీబీ, 128జీబీతోపాటు.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రానుంది. 50 మెగాపిక్సల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉంటుంది.
రెడ్ మీ 12 ప్రో ప్లస్ లో 200 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. మిగిలిన ఫీచర్లన్నీ ఒకే మాదిరి ఉంటాయి. చైనాలో వీటి ధరలు రూ.24,900 నుంచి ఉన్నాయి. మన దగ్గర కూడా రూ.20-25వేల ధరల శ్రేణిలో వీటిని తీసుకురావచ్చు. ఇటీవలే రియల్ మీ 10 ప్రో, 10 ప్రో ప్లస్ ఫోన్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.18వేల నుంచి మొదలవుతున్నాయి. వీటికి రెడ్ మీ 12ప్రో పోటీ ఇవ్వనుంది.