ఉత్తర భారత దేశంలో పొగ మంచు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. అనేక చోట్ల పొగ మంచు ప్రభావంతో కనీసం 50 మీటర్ల దూరం వరకు దారి కమ్మేసింది. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్న ఘటనలో అనేకమంది మరణిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, హరియాణాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. మరో 40 మంది వరకు గాయపడ్డారు. ఢిల్లీ పరిధిలో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ 50 మీటర్ల దూరానికి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా రోడ్డుపైకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. అటు వాహనాలు, రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.